Showing posts with label అక్బర్ బీర్బల్ వినోద కథలు - Abhar birbal vinoda kathalu. Show all posts
Showing posts with label అక్బర్ బీర్బల్ వినోద కథలు - Abhar birbal vinoda kathalu. Show all posts

Tuesday, July 18, 2017

కల ఫలితం -- Kala Phalitham

అక్బర్ చక్రవర్తికి ఒకరోజు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు పళ్ళన్నీ రాలిపోయినట్లు, నోరు బోసిగా ఉన్నట్లు, తనకు నమలడం కష్టమైనట్లు కనిపించింది.

మరునాడు నిండు సభలో తమ ఆస్థాన జ్యోతిష్కుడిని ఈ వింత కలకి ఫలితం ఏమిటి అని అడిగాడు.

స్వప్న శాస్త్రంలో నిష్ణాతుడైన ఆ జ్యోతిష్కుడు "ప్రభూ! ఇది చాలా చెడ్డ కల. మీ కళ్ళ ముందే అయిన వారి మరణం చూడవలిసి వస్తుంది. ఈ కలకు ఫలితం ఇదే."

అది విన్న చక్రవర్తికి ఒక్కసారిగా కోపం వచ్చింది. అక్కడ ఉన్న భటులను పిలిచి ఆ జ్యోతిష్కుడిని బంధించమని చెప్తాడు.

ఇదంతా గమనిస్తున్న బీర్బల్ లేచి "ఆగండి ప్రభూ! ఆ జ్యోతిష్కుడు చెప్పింది తప్పు. ఆ కలకు ఫలితం మీ బంధువులందరి కన్నా మీ ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది అని" అని చెప్పాడు.

అపుడు చక్రవర్తికి తన తప్పు తెలిసింది. ఆ జ్యోతిష్కుడిని వదిలివేయమని భటులకు చెప్పి, జ్యోతిష్కుడిని క్షమాపణ కోరాడు.

తర్వాత బీర్బల్ తో "చెప్పే విషయం ఏదైనా మనసుకు కష్టం కలగని రీతిలో చెప్పాలని మీ ద్వారా తెలుసుకున్నాను" అని బీర్బల్ ని కానుకలతో సత్కరించాడు.


Thursday, July 13, 2017

అష్ట విధ ప్రశ్నలు -- ashta vidha prasnalu

ఒక రోజు అక్బర్ చక్రవర్తి నిండు సభలో కొలువై ఉండగా, అందరినీ ఉద్దేశించి "నాకు కొన్ని సందేహాలు కలిగాయి అవి ఎనిమిది ప్రశ్నలుగా అడగదలిచాను, ఎవరైనా చెప్పగలరా?" అని అన్నారు.

అంతట ఆ సభలోని వారు రకరకాలుగా ఆలోచించసాగారు. అసలు చక్రవర్తి ఏమి అడుగుతారో, వాటికి సమాధానం చెప్పలేకపోతే అవమానపడవలసి వస్తుందని మౌనంగా ఉండిపోయారు. 

అపుడు బీర్బల్ ఈ విధంగా ఆలోచించసాగాడు "చక్రవర్తి ఏమి అడుగుతారో తెలియదు అయినప్పటికీ ప్రయత్నం చేయకపోవడమే అసలైన ఓటమి కదా! అందుచేత ముందు ప్రశ్నలు తెలుసుకోవాలి ఒకవేళ సమాదానాలు తెలియకపోతే అపుడే తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు." అని అనుకుని లేచి నిలబడి చక్రవర్తికి వందనం చేసి "ప్రభూ, ఆ ప్రశ్నలేమిటో చెప్పండి నేను సమాధానాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను." అని అన్నాడు.

అపుడు చక్రవర్తి ఇలా అడగడం మొదలు పెట్టారు. 

"దానం చేసిన కొద్దీ పెరిగే సంపద ఏమిటి?"

------- విద్య, జ్ఞానం. ఇవి ఎంత ఎక్కువ దానం చేస్తే అంత పెరుగుతూ ఉంటాయి. 

"గడ్డి పరక కంటే తేలికైనది ఏమిటి?"

------- మనిషిలోని వక్ర బుద్ధి. దానికి ఇహ లోకంలో కానీ పర లోకం లో కానీ ఎలాంటి విలువ ఉండదు. 

"లోకంలోనే అతి సున్నితమైనది, సూక్ష్మమైనది ఏమిటి?"

------- మంచి బుద్ధి, ఆలోచనలు కలిగిన మనిషి మనసు. 

"గాలి కంటే వేగంగా వెళ్ళేది ఏమిటి?"

------- మనిషి మనసు. 

"నిద్రపోతూ కూడా కన్ను మూయనిది ఏమిటి?"

------- చేప. 

"నీడలా ఎప్పుడు వెన్నంటి ఉండేది ఏమిటి?"

-------- మనిషి చేసే పాపపుణ్యాలు. 

"కష్టపడిన కొద్దీ పెరిగేది ఏమిటి?"

-------- కీర్తి.

"ఏది ఎక్కువగా మనోవేదన కలిగించగలదు?"

-------- మనిషి రహస్యంగా చేసే పాప కర్మలు ఆ మనిషికి ఎక్కువ మనోవేదన కలిగిస్తాయి. 

"ఆహా! బీర్బల్ నా ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పావు." అని అక్బర్ చక్రవర్తి బీర్బల్ కి చాలా బహుమతులు ఇచ్చి సత్కరించాడు.