Thursday, July 13, 2017

అష్ట విధ ప్రశ్నలు -- ashta vidha prasnalu

ఒక రోజు అక్బర్ చక్రవర్తి నిండు సభలో కొలువై ఉండగా, అందరినీ ఉద్దేశించి "నాకు కొన్ని సందేహాలు కలిగాయి అవి ఎనిమిది ప్రశ్నలుగా అడగదలిచాను, ఎవరైనా చెప్పగలరా?" అని అన్నారు.

అంతట ఆ సభలోని వారు రకరకాలుగా ఆలోచించసాగారు. అసలు చక్రవర్తి ఏమి అడుగుతారో, వాటికి సమాధానం చెప్పలేకపోతే అవమానపడవలసి వస్తుందని మౌనంగా ఉండిపోయారు. 

అపుడు బీర్బల్ ఈ విధంగా ఆలోచించసాగాడు "చక్రవర్తి ఏమి అడుగుతారో తెలియదు అయినప్పటికీ ప్రయత్నం చేయకపోవడమే అసలైన ఓటమి కదా! అందుచేత ముందు ప్రశ్నలు తెలుసుకోవాలి ఒకవేళ సమాదానాలు తెలియకపోతే అపుడే తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు." అని అనుకుని లేచి నిలబడి చక్రవర్తికి వందనం చేసి "ప్రభూ, ఆ ప్రశ్నలేమిటో చెప్పండి నేను సమాధానాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను." అని అన్నాడు.

అపుడు చక్రవర్తి ఇలా అడగడం మొదలు పెట్టారు. 

"దానం చేసిన కొద్దీ పెరిగే సంపద ఏమిటి?"

------- విద్య, జ్ఞానం. ఇవి ఎంత ఎక్కువ దానం చేస్తే అంత పెరుగుతూ ఉంటాయి. 

"గడ్డి పరక కంటే తేలికైనది ఏమిటి?"

------- మనిషిలోని వక్ర బుద్ధి. దానికి ఇహ లోకంలో కానీ పర లోకం లో కానీ ఎలాంటి విలువ ఉండదు. 

"లోకంలోనే అతి సున్నితమైనది, సూక్ష్మమైనది ఏమిటి?"

------- మంచి బుద్ధి, ఆలోచనలు కలిగిన మనిషి మనసు. 

"గాలి కంటే వేగంగా వెళ్ళేది ఏమిటి?"

------- మనిషి మనసు. 

"నిద్రపోతూ కూడా కన్ను మూయనిది ఏమిటి?"

------- చేప. 

"నీడలా ఎప్పుడు వెన్నంటి ఉండేది ఏమిటి?"

-------- మనిషి చేసే పాపపుణ్యాలు. 

"కష్టపడిన కొద్దీ పెరిగేది ఏమిటి?"

-------- కీర్తి.

"ఏది ఎక్కువగా మనోవేదన కలిగించగలదు?"

-------- మనిషి రహస్యంగా చేసే పాప కర్మలు ఆ మనిషికి ఎక్కువ మనోవేదన కలిగిస్తాయి. 

"ఆహా! బీర్బల్ నా ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పావు." అని అక్బర్ చక్రవర్తి బీర్బల్ కి చాలా బహుమతులు ఇచ్చి సత్కరించాడు. 


No comments:

Post a Comment