Wednesday, July 12, 2017

పిల్లి, ఎలుక : అపాయంలో ఉపాయం - Pilli Eluka : Apaayamlo upaayam

ఆహారం కోసం తిరిగి, తిరిగి అలిసిపోయిన ఒక పిల్లికి, ఒక ఎలుక అప్పుడే తన కన్నంలో దూరుతూ కనిపించింది.
అపుడు ఆ పిల్లికి, ఆ ఎలుకను ఎలాగైనా తినాలనిపించింది. కాసేపు ఆలోచించి, ఆ ఎలుకను ఇలా పిలిచింది. "ఎలుక బావా..  ఎలుక బావా.. " ఎలుక బయటికి వచ్చి "ఏమిటి సంగతి పిల్లి బావా?" అని అడిగింది.

అపుడు పిల్లి ఎలుకతో "ఆ పక్క పొలంలో మంచి వేరు శనగ కాయలు ఉన్నాయి. వెళ్ళి తిందామా?" అని అడిగింది.
ఎలుక, పిల్లి తనను తినడానికే పిలుస్తుంది అని గ్రహించి, కాస్త ఆలోచించి "పిల్లి బావా.. ఇపుడు వెళితే మనం దొరికిపోతాం కనుక రేపు తెల్లవారుజామున వెళదాం" అని చెప్పింది. పిల్లి కాస్త నిరాశ చెంది "సరే" అని వెళ్ళిపోయింది.

మరుసటి రోజు తెల్లవారుజామున పిల్లి వచ్చి ఎలుకను పిలిచింది. అపుడు ఎలుక "నేను ఇపుడే వెళ్లి వచ్చాను, నువ్వు వెళ్ళు, రేపు కలుద్దాం" అని చెప్పింది. పిల్లి మళ్ళీ నిరాశ చెంది వెళ్ళిపోయింది.

ఇలా రెండు రోజులు గడిచాక పిల్లికి ఎలుక కావాలనే ఇలా చేస్తుంది అని అర్థం అయింది.

అపుడు ఒక రోజు పిల్లి ఎలుక కంటే ముందే పొలానికి బయల్దేరింది. ఆ రోజు ఎలుక కావాలనే ఆలస్యంగా బయల్దేరింది.

అంతలో రోజూ తన పొలం ఎవరు పాడు చేస్తున్నారో తెలుసుకోవాలని కాపు కాసిన రైతు పిల్లిని చూసి ఆ పిల్లే రోజూ తన పొలం పాడు చేస్తుంది అని అనుకుని ఒక పెద్ద కర్ర పిల్లి మీదకు విసిరాడు. ఆ దెబ్బకి పిల్లి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. మళ్ళీ ఆ దరిదాపులకు కూడా రాలేదు.

ఆ ఎలుక కూడా ఆ పొలంలోకి మరెప్పుడూ వెళ్ళకుండా సంతోషంగా ఉండసాగింది.


No comments:

Post a Comment